PhonePe Blogs Main Featured Image

Trust & Safety

పోలీసుల నుండి కాల్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త! డిజిటల్ అరెస్ట్ స్కామ్‌ను ఎలా గుర్తించాలో తెలుసుకోండి

PhonePe Regional|3 min read|05 December, 2024

URL copied to clipboard

అమాయకులను మోసం చెయ్యాలనుకునే స్కామర్లు, ముందుగా వారిలో భయాన్ని కలిగిస్తారు. ఈ ప్రక్రియపైనే సైబర్‌క్రైమ్ అంతా నడుస్తోంది. ముప్పును పసిగట్టలేని అమాయక బాధితులను మోసగించడానికి స్కామర్లు కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు. పోలీసు లేదా ప్రభుత్వ అధికారులు వంటి చట్టాన్ని అమలు చేసే ఉన్నతాధికారుల్లాగా నటించి బాధితులను భయపెట్టడమే ఈ కొత్త ట్రిక్. అధికారులంటే ప్రజలకు సహజంగా ఉండే భయాన్ని ప్రయోగించడమే నేరస్తుల వ్యూహం. “డిజిటల్ అరెస్ట్” స్కామ్ అని పిలిచే ఈ వ్యూహాన్ని ప్రయోగించే స్కామర్లు, తొలుత చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్నారని ప్రజలను భయపెడతారు. ఈ ప్రమాదకర సంకేతాలను గుర్తించలేని అమాయకులు, మోసగాళ్ల మాటలను నమ్మి, నకిలీ అధికారులకు సహకరిస్తూ స్కామ్‌ బారిన పడతారు.

ఈ బ్లాగ్‌లో, ఈ స్కామ్ గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతి విషయాన్ని మేము కవర్ చేశాము, అంటే ఈ స్కామ్ ఎలా చేస్తారు, మోసం ఎలా జరుగుతుంది, అటువంటి సందర్భాలలో మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి వంటి అంశాలను కవర్ చేశాము.

డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే ఏమిటి?

డిజిటల్ అరెస్ట్ స్కామ్ అనేది మరొక వ్యక్తి లాగా నటిస్తూ చేసే ఒక రకమైన మోసం, దీన్లో స్కామర్లు ఇమెయిల్ చేసి, టెక్స్ట్ మెసేజ్‌లు పంపించి లేదా ఫోన్ కాల్ చేసి తాము చట్టాన్ని అమలు చేసే లేదా ఉన్నతాధికారులమని నమ్మబలుకుతారు. ఆన్‌లైన్ నేరాలు లేదా సైబర్‌ నేరాలకు సంబంధించి మీపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందని లేదా మీపై విచారణ జరుగుతోందని వారు భయపెడతారు. మిమ్మల్ని ఈ సమస్య నుండి బయటపడెయ్యాలంటే, వారికి వెంటనే పేమెంట్ చెయ్యాలని లేదా మీ వ్యక్తిగత సమాచారం చెప్పాలని డిమాండ్ చేస్తారు, మీరు వారి మాట వినకపోతే అరెస్ట్ చేస్తామని బెదిరిస్తారు.

డిజిటల్ అరెస్ట్ స్కామ్ ఎలా జరుగుతుంది?

మీరు డబ్బులు పంపేలా లేదా సున్నితమైన సమాచారం ఇచ్చేలా మిమ్మల్ని భయపెట్టడమే డిజిటల్ అరెస్ట్ స్కామ్ ముఖ్య లక్ష్యం. ఈ స్కామ్ టెక్నిక్‌ను దశలవారీగా ఎలా వాడుతారో ఇక్కడ వివరించాము:

  1. మొదటి సంప్రదింపు: ముందుగా మీకు కాల్, ఇమెయిల్ లేదా టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, వాటి ద్వారా అవతలి వ్యక్తి ప్రభుత్వ లేదా చట్టాన్ని అమలు చేసే సంస్థకు చెందిన అధికారి అని నమ్మబలుకుతారు. ఆ మెసేజ్ లేదా మెయిల్‌లో నకిలీ ప్రభుత్వ చిహ్నాలు(గవర్నమెంట్ సీల్స్) లేదా లోగోలు ఉండవచ్చు, కొన్నిసార్లు చట్టబద్ధమైన ఫోన్ నంబర్ నుండే మెసేజ్ లేదా కాల్ వచ్చినట్లుగా కూడా కనిపించవచ్చు.
  • టెక్స్ట్ మెసేజ్‌లు (SMS): మీరు చట్టపరమైన సమస్యలో ఇరుక్కున్నారని, వెంటనే స్పందించాల్సిన అవసరముందని మీకు వచ్చే టెక్స్ట్ మెసేజ్‌లో ఉంటుంది.
  • ఫోన్ కాల్స్: పోలీసు అధికారులు లేదా ఉన్నతాధికారులుగా నటిస్తూ లైవ్ కాలర్లు బాధితులను సంప్రదిస్తారు లేదా ఆటోమేటెడ్ కాల్స్ చేస్తారు.
  • సోషల్ మీడియా & మెసేజింగ్ యాప్‌లు: స్కామర్లు ఫేస్‌బుక్, వాట్సప్ లేదా ఇతర మెసేజింగ్ సర్వీసులు వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా కూడా మిమ్మల్ని సంప్రదించవచ్చు.
  • వీడియో కాల్స్: మోసగాళ్లు యూనిఫాం వేసుకుని, వీడియో కాల్స్ చేసి ఉన్నతాధికారుల మాదిరిగా నటిస్తారు. వారు తరచుగా బాధితులను భయపెట్టడానికి ఈ వ్యూహాన్ని ఉపయోగిస్తారు. మీరు నేర కార్యకలాపాలలో పాల్గొన్నారని లేదా ఇరుక్కున్నారని చెబుతుంటారు, ఈ కేసులో మీరు అరెస్టు కాకుండా ఉండాలంటే వెంటనే పేమెంట్ చెయ్యాలని లేదా సున్నితమైన సమాచారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తారు.
  1. ఆరోపణ: మీరు భయంకరమైన నేరానికి పాల్పడ్డారని స్కామర్లు చెబుతారు, అయితే చాలా సార్లు ఆ కేసు గురించి స్పష్టంగా చెప్పరు, కానీ అది చాలా పెద్ద కేసు అని చెబుతారు, అంటే “అనుమానాస్పద ఇంటర్నెట్ యాక్టివిటీ” లేదా “మోసపూరిత లావాదేవీలు” వంటి కేసులో మీపై విచారణ జరపాలని తెలుపుతారు. ఒక్కోసారి కేస్ నంబర్‌ను కూడా ప్రస్తావిస్తారు లేదా మీకు వారిపై నమ్మకం కలగడానికి చట్టపరమైన పదాలు, వాక్యాలు, సెక్షన్ల నంబర్లను పేర్కొంటారు. 
  2. తక్షణ స్పందనకు ఒత్తిడి తేవడం: అరెస్టు కాకుండా ఉండాలంటే, జరిమానా పే చెయ్యాలని లేదా వ్యక్తిగత సమాచారాన్ని తెలపాలని, వీటిలో ఏదో ఒక పని వెంటనే పూర్తి చేయాలని మిమ్మల్ని ఒత్తిడి చేస్తారు. ఒకవేళ మీరు భయపడి డబ్బులు పంపుతామని మాట ఇస్తే వారు క్రిప్టోకరెన్సీ, గిఫ్ట్ కార్డ్‌లు లేదా వైర్ ట్రాన్స్‌ఫర్ ద్వారా పేమెంట్ చేయమని చెప్తారు. ఎందుకంటే ఈ పద్ధతుల్లో చేసిన పేమెంట్లను ట్రేస్ చేయలేం, అలాగే రివర్స్ కూడా చేయలేం.
  3. బెదిరింపులను తీవ్రతరం చేయడం: మీరు ఆ కాల్ చట్టబద్ధతను ప్రశ్నించినా లేదా వారు చెప్పినట్లుగా చేయడానికి వెనుకాడినా స్కామర్ దూకుడు పెంచుతాడు. ఇక చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, జరిమానాలు విధిస్తామని లేదా వెంటనే అరెస్టు చేస్తామని బెదిరిస్తాడు.

మిమ్మల్ని టార్గెట్ చేస్తే మీరు ఏం చేయాలి

మీరు డిజిటల్ అరెస్ట్ స్కామ్‌కు గురవుతున్నారని మీకు అనుమానం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ దశలను అనుసరించండి:

  1. వెంటనే స్పందించకండి: ఆందోళన చెందకుండా పరిస్థితి గురించి ఆలోచించండి, కాసేపు ప్రశాంతంగా ఓ చోట కూర్చోండి. స్కామర్లు బాధితులను మోసగించడానికి వారిలో ఉండే భయాందోళనలనే ఆసరాగా చేసుకుంటారు.
  2. కాంటాక్ట్‌ను వెరిఫై చేయండి: మీకు చట్టబద్ధమైన సంస్థ నుండి కాల్ వచ్చిందా లేదా అని నిర్ధారించుకోవడానికి అధికారిక ఛానెళ్ల (స్కామర్ నంబర్‌కు కాల్ చేయకండి) ద్వారా సంబంధిత ఏజెన్సీని నేరుగా సంప్రదించండి.
  3. ఘటన గురించి రిపోర్ట్ చేయండి: మీకు అనుమానాస్పద మెసేజ్ వచ్చినట్లయితే, దాన్ని స్థానిక అధికారులకు లేదా వినియోగదారు సంరక్షణ సంస్థ (కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)కి తెలపండి. అలా చేస్తే స్కామ్‌లను ట్రాక్ చేయడంలో, అలాగే ఇతరులను హెచ్చరించడంలో ఈ ఏజెన్సీలకు సహాయపడినవారవుతారు.                                        
  4. మీ సమాచారాన్ని భద్రపర్చుకోండి: మీరు అనుకోకుండా వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసినట్లయితే, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి పాస్‌వర్డ్‌లను మార్చండి, ఒకవేళ ఆర్థిక సమాచారాన్ని తెలిపితే మీ బ్యాంక్‌ను అప్రమత్తం చేయడం వంటి చర్యలు తీసుకోండి.
  5. సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించండి: మీ సమాచారాన్ని యాక్సెస్ చేసేందుకు స్కామర్లు చేసే ఫిషింగ్ ప్రయత్నాలు, అలాగే వారు ఉపయోగించే మాల్‌వేర్ల నుండి కాపాడుకోవడానికి మీ పరికరాలలో లేటెస్ట్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఖచ్చితంగా ఇన్‌స్టాల్ చేసుకోండి.
  6. టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్(2FA): స్కామర్లు మీ అకౌంట్లను యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తారు, ఇలాంటి వాటి నుండి బయటపడానికి వాటికి టూ-ఫ్యాక్టర్ (రెండుసార్లు వెరిఫై చేసే) అథెంటికేషన్(2FA)ను ఎనేబుల్ చేయండి.
  7. మీరు తెలుసుకోండి, ఇతరులకూ చెప్పండి: సాధారణ స్కామ్ వ్యూహాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి, ఈ విజ్ఞానాన్ని స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలపండి.

డిజిటల్ అరెస్ట్ స్కామ్ వంటి స్కామ్‌లను మనలోని భయం, ఆందోళనను ఆసరగా చేసుకుని మోసం చేసేలా స్కామర్లు డిజైన్ చేశారు. స్కామ్ సంకేతాలను గుర్తించడం, అలాగే ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండటం వల్ల మీరు మోసం బారినపడకుండా ఆపవచ్చు. అలాగే ఇతరులూ అదే ఉచ్చులో పడకుండా అడ్డుకోవడంలో సహాయపడవచ్చు.

మీరు డిజిటల్ అరెస్ట్ స్కామ్‌కు గురైనట్లయితే PhonePeలో ఈ సమస్యను ఎలా తెలపాలి

ఒకవేళ PhonePeలో మిమ్మల్ని స్కామర్ మోసం చేస్తే, మీరు వెంటనే ఈ కింది మార్గాల్లో సమస్యను తెలపవచ్చు:

  1. PhonePe యాప్: Help/సహాయం విభాగానికి వెళ్లి, “లావాదేవీతో సమస్య ఉంది” ఆప్షన్‌ కింద మీ సమస్యను తెలపండి.
  2. PhonePe కస్టమర్ కేర్ నంబర్: మీరు సమస్యను తెలపడానికి PhonePe కస్టమర్ కేర్ నంబర్‌ 80–68727374 / 022–68727374కు కాల్ చేయవచ్చు, ఆ తర్వాత కస్టమర్ కేర్ ఏజెంట్ మీ కోసం టికెట్‌ను క్రియేట్ చేసి, మీ సమస్యకు పరిష్కారం చూపుతారు.
  3. వెబ్‌ఫామ్‌‌లో సబ్‌మిట్ చేయడం : మీరు PhonePe వెబ్‌ఫామ్‌ https://support.phonepe.com/కు వెళ్లి కూడా టికెట్‌ను పంపవచ్చు.
  4. సోషల్ మీడియా: మీరు ఈ కింద పేర్కొన్న PhonePe సోషల్ మీడియా హ్యాండిల్స్‌ ద్వారా మోసపూరిత ఘటనలను రిపోర్ట్ చేయవచ్చు

ట్విటర్ — https://twitter.com/PhonePeSupport

ఫేస్‌బుక్‌ — https://www.facebook.com/OfficialPhonePe

  1. ఫిర్యాదు పరిష్కారం: ఇదివరకే చేసిన ఫిర్యాదును పరిష్కరించమని కోరడానికి, మీరు https://grievance.phonepe.com/లోకి లాగిన్ అయ్యి, గతంలో పంపిన టికెట్ ఐడిని షేర్ చేయవచ్చు.
  2. సైబర్ సెల్: చివరగా, మీరు సమీపంలోని సైబర్ క్రైమ్ సెల్‌కు వెళ్లి ఈ మోసం గురించి ఫిర్యాదు చేయవచ్చు లేదా https://www.cybercrime.gov.in/కు వెళ్లి   ఆన్‌లైన్‌లో ఫిర్యాదును రిజిస్టర్ చేయవచ్చు లేదా సైబర్ క్రైమ్ సెల్ హెల్ప్‌లైన్‌ నంబర్ 1930కు కాల్ చేసి మీ సమస్యను తెలపవచ్చు.
  3. DOT : డిజిటల్ నేరం జరగకపోయినప్పటికీ, మీకు ఎదురైన ఘటన గురించి అనుమానం ఉంటే, అప్పుడు కూడా రిపోర్ట్ చేయండి. టెలికమ్యూనికేషన్స్ విభాగం సంచార్ సాథీ పోర్టల్ (sancharsaathi.gov.in)లో చక్షు సౌకర్యాన్ని ప్రారంభించింది. ఏవైనా మెసేజ్‌లు, కాల్స్, ఇంకా వాట్సప్ అకౌంట్లు మోసపూరితమైనవని అనుమానం కలిగితే ఇక్కడ రిపోర్ట్ చేయవచ్చు.

Keep Reading