Trust & Safety
వెలుగులోకి వచ్చిన కొత్త మోసం: ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్‌తో జాగ్రత్త
PhonePe Regional|3 min read|30 January, 2024
1850వ దశకంలో స్టాక్ ఎక్స్‌ఛేంజీలు ప్రారంభమైనప్పుడు, స్టాక్ బ్రోకర్లు బాంబే టౌన్ హాల్‌కు ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కింద ట్రేడింగ్ చేసేవాళ్లు. అయితే వాళ్లలో ఎవరికీ కూడా దాదాపు ఒకటిన్నర శతాబ్దం తర్వాత, అంటే 2023లో 17% పైగా భారతీయ కుటుంబాలకు ఆన్‌లైన్ ట్రేడింగ్ ఓ పెట్టుబడి మార్గం అవుతుందని తెలియదు.*
డిజిటల్ వేవ్ వల్ల బ్యాంకింగ్, లావాదేవీలు, పెట్టుబడి పెట్టడం వంటివి కాలక్రమేణా చాలా సులభం అయ్యాయని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు, అయితే ఇందులో కొన్ని రిస్క్‌లు కూడా ఉన్నాయి. స్కామ్‌స్టర్‌లు (స్కామ్ చేసే వాళ్లు) ఆన్‌లైన్ లావాదేవీలతో మోసం చేసే అవకాశాలను వెతుకుతుంటారు, అలానే అమాయకులను మోసం చేయడానికి తెలివైన మార్గాలను కనుక్కొంటారు. మరో వైపు మేము కూడా ప్రజలు స్కామ్‌ల బారిన పడకుండా కాపాడేందుకు ప్రయత్నిస్తుంటాము, ఇంకా తాజాగా వెలుగులోకి వచ్చిన స్కామ్‌ల గురించి మీకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తాము. ఈ బ్లాగ్‌లో, ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్‌ల గురించి మీకు అవగాహన కల్పిస్తున్నాము.
ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్ అంటే ఏమిటి?
స్కామ్ చేసే వ్యక్తి తనే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ బ్రోకర్‌ను అని నమ్మబలుకుతాడు, అలానే తప్పుడు సమాచారం ఇచ్చి, నకిలీ వెబ్‌సైట్‌లలో ప్రజలు పెట్టుబడి పెట్టేలా నమ్మిస్తాడు. స్కామ్ చేసే వ్యక్తి మాటలు నమ్మిన ప్రజలు స్టాక్స్, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, ఆస్తులు మొదలైన వాటి రూపంలో పెట్టుబడి పెడితే ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్ జరుగుతుంది.
స్కామ్‌స్టర్లు ఎలా మోసం చేయగలుగుతారు?
స్కామ్ చేసే వ్యక్తులు పెట్టుబడిదారులకు అసంభవమైన హామీలు ఇస్తారు. అంటే ఎలాంటి నష్టమూ రాదని, మునుపెన్నడూ లేనన్ని లాభాలు వస్తాయని చెబుతారు. ఇప్పటికే చాలా మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని, ఆలస్యం చేస్తే ఆ అవకాశాన్ని కోల్పోతారనే భయాన్ని మీలో కలిగించడమే వారి ఉద్దేశం. ఈ రకమైన స్కామర్లు సాధారణంగా తమ గురించి తాము ఆన్‌లైన్‌లో సోషల్ మీడియా, వెబ్‌సైట్‌లలో ప్రచారం చేసుకుంటారు. అలానే ప్రామాణికమైన, ఆథరైజ్ చేసిన ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు లేదా పెట్టుబడి వ్యాపారాలను తాము నిర్వహిస్తున్నామని నమ్మకం కలిగేలా చెప్తారు. ఈ స్కామ్‌లకు పాల్పడే నేరస్థులు స్థానిక లేదా జాతీయ ఆర్థిక చట్టాల నుండి తమకు మినహాయింపు ఉందని తరచుగా చెప్తారు. వాళ్లు మన నిధులకు యాక్సెస్‌ను నిలిపివేయవచ్చు, ఇంకా నకిలీ పన్నులు, ఫీజులు లేదా ఇతర ఛార్జీలు చెల్లించాలని డిమాండ్ చేసి కూడా మీరు స్కామ్‌కు బలయ్యేలా చేయవచ్చు.
చాలా ట్రేడింగ్ స్కామ్‌లు సోషల్ మీడియాలో లేదా మెసేజింగ్ అప్లికేషన్‌ల ద్వారానే జరుగుతాయి. మీకు తెలియని వ్యక్తి నుండి కాల్ వచ్చినా లేదా మీకు ఆన్‌లైన్‌లో పరిచయం అయిన వ్యక్తి మీరు ఎప్పుడూ వినని బిజినెస్ వెబ్‌సైట్‌ను మీకు పరిచయం చేసినా, అది స్కామ్ అయ్యే అవకాశం ఉంది. ఎంత డబ్బు సంపాదించబోతున్నాం, అసలు ఏ రిస్క్ లేకుండానే ఈజీగా లాభాలు పొందబోతున్నామని వారు హామీ ఇచ్చినప్పటికీ, వాటిని నమ్మి స్కామ్ చేసే ట్రేడింగ్ వెబ్‌సైట్‌లకు డబ్బులు పంపిస్తే, అవన్నీ పోగొట్టుకున్నట్లే. మోసపోయేందుకు అవకాశమున్న బాధితుల కోసం వారు సోషల్ మీడియా, మెసేజింగ్ అప్లికేషన్‌లలో వెతుకుతారు. దీనితో పాటు, ఈ కింద పేర్కొన్న ఐదు అంశాలు ట్రేడింగ్ స్కామ్ జరిగేందుకు ఉన్న అవకాశాన్ని సూచిస్తున్నాయి:
- మోసం చేయాలనుకున్న బ్రోకర్లు నమ్మశక్యం కాని లాభాలను పొందాలంటే చిన్న పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనను ఉద్ధృతంగా ప్రచారం చేస్తారు.
- లాభాలు పెరిగాయని గమనించిన సదరు వ్యక్తి, డబ్బును ఉపసంహరించుకోవాని కోరుకున్నప్పుడు ఆ నిధులను యాక్సెస్ చేయలేని పరిస్థితి తలెత్తుతుంది. ఎందుకు ఉపసంహరించుకోలేకపోతున్నామని అడిగితే పన్నులు, కమీషన్లు చెల్లించాలనే అసమంజసమైన సాకులను స్కామ్ చేస్తున్న వాళ్లు చెబుతారు.
- కాలక్రమేణా, బాధితుడు ఎన్నిసార్లు పన్నులు, కమీషన్‌లు చెల్లించినప్పటికీ, ఉపసంహరించుకునేందుకు యాక్సెస్ రావట్లేదని గ్రహిస్తారు, తమ డబ్బు తిరిగి ఇచ్చే ఉద్దేశం స్కామ్ చేసే వ్యక్తికి లేదని నిరూపితమవుతుంది.
- తెలివైన మోసగాళ్లు మరింత డబ్బును కోరుతారు, అలానే పూర్తిగా నమ్మేందుకు అవకాశమున్న కొత్త కారణాలు చెబుతారు. అతి త్వరలోనే డబ్బు ఉపసంహరించు కోవచ్చనే హామీలను ఇస్తూ ఉంటారు.
- స్కామర్‌లు మనకి అవసరం వచ్చినప్పుడు ప్రతిస్పందించరు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వారిని సంప్రదించలేము, అధిక మొత్తంలో డబ్బును తీసుకున్న తర్వాత, వాళ్లు సమాధానం ఇవ్వడమే ఆపేస్తారు.
రహస్యాలను బయటపెట్టే, అనుమానాస్పద సంకేతాలపై ఒక కన్ను వేసి ఉంచితే ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్‌ను గుర్తించడం సాధ్యమవుతుంది.
మీరు ట్రేడింగ్ స్కామ్‌కు గురైనట్లయితే ఎలా నివేదించాలి
మీరు ట్రేడింగ్ స్కామ్‌కు గురయ్యారనే అనుమానం కలిగితే, జరుగుతున్న నష్టాన్ని తగ్గించడానికి, అలానే భవిష్యత్తులో జరగబోయే నష్టాలను నివారించడానికి వెంటనే చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం పరిగణనలోకి తీసుకోవాల్సిన దశలను ఇక్కడ వివరించాము:
- PhonePe యాప్: సహాయ విభాగానికి వెళ్లి, ‘Others/ఇతర అంశాలు’ కింద సమస్యను తెలియచేయండి. ‘Account Security & Reporting Fraudulent Activity/ఖాతా భద్రత & మోసపూరిత చర్యలను నివేదించడం‘ను ఎంచుకోండి, అలానే మోసం గురించి తెలియచేయడానికి అత్యంత సముచితమైన ఎంపికను ఎంచుకోండి.
- PhonePe కస్టమర్ కేర్ నంబర్: మీరు ఏదైనా సమస్యను తెలియచేయడానికి PhonePe కస్టమర్ కేర్ నంబర్: 80–68727374/022–68727374కు కాల్ చేయండి, ఆ సమస్యను తెలుసుకున్న తర్వాత కస్టమర్ కేర్ ఏజెంట్ ఓ టికెట్‌ను క్రియేట్ చేసి, మీ సమస్యకు పరిష్కారం చూపే ప్రక్రియలో సహాయం చేస్తారు.
- వెబ్‌ఫారం సమర్పణ: మీరు PhonePe వెబ్‌ఫారం: https://support.phonepe.com/ను ఉపయోగించి కూడా మీ సమస్యను తెలియచేయవచ్చు
- సోషల్ మీడియా: మీరు PhonePe సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మోసాల గురించి తెలియచేయవచ్చు
- Twitter — https://twitter.com/PhonePeSupport
- Facebook — https://www.facebook.com/OfficialPhonePe
- ఫిర్యాదు: మీరు ఇదివరకే తెలిపిన సమస్యపై ఫిర్యాదు చేయడానికి, https://grievance.phonepe.com/కు లాగిన్ అయ్యి, గతంలో తెలియచేసిన సమస్యకు సంబంధించిన టికెట్ ఐడిని పంచుకోండి.
- సైబర్ సెల్: అన్నీ ప్రయత్నించాక చివరగా, మీరు సమీప సైబర్ క్రైమ్ సెల్‌లో మోసం గురించి ఫిర్యాదు చేయవచ్చు లేదా https://www.cybercrime.gov.in/కు వెళ్లి ఆన్‌లైన్‌లో ఫిర్యాదును నమోదు చేయవచ్చు లేదా 1930కు కాల్ చేసి సైబర్ క్రైమ్ సెల్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించండి.
గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య గమనిక — PhonePe ఎప్పుడూ రహస్య లేదా వ్యక్తిగత వివరాలను అడగదు. Phonepe.com డొమైన్ నుండి కాకుండా, PhonePe నుండి పంపించామని/వచ్చాయని చెప్పే మెయిల్స్ అన్నింటినీ అస్సలు పట్టించుకోవద్దు. మీరు ఏదైనా మోసం జరుగుతోందని అనుమానించినట్లయితే, దయచేసి వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించండి.
*ఆధారాలు: