PhonePe Blogs Main Featured Image

Trust & Safety

ఫిషింగ్ దాడుల గుర్తింపు, నివారణ

PhonePe Regional|3 min read|20 March, 2025

URL copied to clipboard

ఫిషింగ్ దాడులు నిత్యకృత్యం అయిపోయాయి, భారతీయులే లక్ష్యంగా ఇమెయిల్‌లు, టెక్స్ట్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్‌ ద్వారా జరుగుతున్న మోసాలు పెరుగుతున్నాయి. డిజిటల్ సర్వీస్‌లకు మొబైల్ పరికరాలే ప్రధాన వేదిక కావడం వల్ల, ఎక్కువ మంది మొబైల్ యూజర్లు ఉన్న భారతదేశమే ఈ మోసాలకు ప్రధాన లక్ష్యంగా మారింది. అయితే ఈ స్కామ్‌లు ఎలా జరుగుతాయో అర్థం చేసుకుని, మీ గుర్తింపుతో పాటు మీ డబ్బును కాపాడుకోవడం చాలా ముఖ్యం.

ఫిషింగ్ అంటే ఏమిటి, ఇది ఎన్ని రకాలుగా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం:

ఫిషింగ్ అంటే ఏమిటి?

ఫిషింగ్ అనేది ఒక సోషల్ ఇంజనీరింగ్ స్కామ్. దీనికి పాల్పడే మోసగాళ్లు మీ నుండి సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని పొందేలా లేదా మీ పరికరంలో మాల్వేర్ డౌన్‌లోడ్ చేసే హానికరమైన లింక్‌లను మీరే స్వయంగా క్లిక్ చేసేలా బురిడీ కొట్టిస్తారు.

ఫిషర్లు (ఫిషింగ్‌కు పాల్పడేవాళ్లు) సాధారణంగా మీ బ్యాంక్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లేదా ప్రభుత్వ సంస్థ వంటి చట్టబద్ధమైన సంస్థలు పంపినట్లుగా అనిపించే లేదా వాటిని పోలి ఉన్న మోసపూరిత ఇమెయిల్స్‌ను పంపుతారు. ఆ మెయిల్‌లో చెప్పిన పనిని మీరు ఉన్నపళంగా పూర్తి చేసేలా, అందులోని లింక్‌ నొక్కేలా, అటాచ్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేసేలా లేదా పాస్‌వర్డ్‌లు, డెబిట్ / క్రెడిట్ కార్డ్ నంబర్లు లేదా ఆధార్ క్రెడెన్షియల్స్‌ వంటి వ్యక్తిగత వివరాలను పంపేలా మీలో కంగారు పుట్టించడమే ఆ మెసేజ్‌ ఉద్దేశం. 

ఫిషింగ్ ఇమెయిల్‌లను గుర్తించే విధానం:

  • సాధారణ కంటెంట్: నమ్మకమైన సోర్స్‌ల నుండి వచ్చే ఇమెయిల్స్‌లో సాధారణంగా మీ పేరును ప్రస్తావిస్తారు, మిమ్మల్ని మీ పేరుతోనే సంబోధిస్తారు, బ్యాంకింగ్ సంస్థ నుండి ఏదైనా మెయిల్ వస్తే, అందులో కార్డ్ నంబర్ లేదా అకౌంట్ నంబర్ వంటి మీ వివరాలు ఉంటాయి లేదా ఒకవేళ ఆ మెయిల్ ఇ-కామర్స్ బ్రాండ్ నుండి వస్తే దానిలో ఆర్డర్ నంబర్‌ ఉంటుంది. ఫిషింగ్ ఇమెయిల్స్‌లో ఇవేమీ ఉండవు, కేవలం సాధారణ కంటెంట్‌ ఉంటుంది, ఇంకా దానిలోని లింక్‌పై క్లిక్ చేయమని మాత్రమే మిమ్మల్ని ప్రేరేపిస్తాయి.
  • పంపిన వ్యక్తి మెయిల్ అడ్రస్‌‌లు అనుమానాస్పదంగా ఉండటం: ఇమెయిల్ అడ్రస్‌ను జాగ్రత్తగా చెక్ చేయండి. అందులో అక్షరదోషాలు లేదా అసాధారణ అక్షరాలు ఉండవచ్చు.
  • ఆగమేఘాల మీద చర్య తీసుకోవాలని పిలుపు: “వెంటనే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది” లేదా “మీ అకౌంట్‌ తాత్కాలికంగా నిలిచిపోతుంది” వంటి వాక్యాలు ఉంటే, ప్రమాద హెచ్చరికగా గుర్తించాలి.
  • వ్యక్తిగత సమాచారాన్ని కోరే అభ్యర్థనలు: చట్టబద్ధమైన సంస్థలు చాలా అరుదుగా ఇమెయిల్ ద్వారా సున్నితమైన సమాచారాన్ని అడుగుతాయి.
  • వ్యాకరణ, అక్షర దోషాలు: ఫిషింగ్ ఇమెయిల్స్‌లో తరచుగా అక్షర, వ్యాకరణ దోషాలు ఉంటాయి.

ఫిషింగ్‌ నివారణ పద్ధతులు:

  • ఊహించని ఇమెయిల్స్ పట్ల సంశయంతో ఉండండి: విశ్వసనీయమైన సోర్స్‌ నుండే వచ్చినట్లుగా కనిపించినప్పటికీ, అనూహ్యమైన ఇమెయిల్స్ వచ్చినప్పుడు సంశయంతో ఉండండి, అంతేగాక సందేశాన్ని స్పష్టంగా చదివి, పంపినవారు ఎవరో వెరిఫై చేసేంత వరకు తొందరపడి లింక్‌లపై క్లిక్ చేయకండి.
  • అనుమానాస్పద ఇమెయిల్స్‌లోని లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయకండి: దీనికి బదులుగా, వెబ్‌సైట్ అడ్రస్‌ను నేరుగా మీ బ్రౌజర్‌లో టైప్ చేయండి.
  • పంపినవారి గుర్తింపును వెరిఫై చేయండి: ఇమెయిల్ మీకు తెలిసిన/పరిచయమున్న సంస్థ నుండే వచ్చిందని నిర్ధారించడం కోసం మీకు అందుబాటులో ఉన్న ఫోన్ నంబర్ లేదా వెబ్‌సైట్ ద్వారా నేరుగా సంస్థను సంప్రదించండి.
  • మీ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసుకోండి: యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్, వెబ్ బ్రౌజర్లు ఫిషింగ్ ప్రయత్నాలను గుర్తించడంలో సహాయపడతాయి.

స్మిషింగ్ అంటే ఏమిటి? 

స్మిషింగ్ (SMS ఫిషింగ్) అనేది ఒక రకమైన మోసం, దీనిలో స్కామర్లు బాధితులను మోసగించడానికి టెక్స్ట్ మెసేజ్‌లను ఉపయోగిస్తారు, ఈ మెసేజ్‌ల రూపంలో వారు హానికరమైన లింక్‌లను క్లిక్ చేసే లేదా వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసే పరిస్థితిని కల్పిస్తారు. తాము డెలివరీ సర్వీస్‌ వాళ్లమని, బ్యాంక్‌ నుండి కాల్ చేస్తున్నామని లేదా మీరు బహుమతి గెలుచుకున్నారని అబద్ధాలు చెప్పి కూడా మోసం చేయవచ్చు.

స్మిషింగ్ స్కామ్‌లను గుర్తించే పద్ధతి

  • నకిలీ ప్యాకేజీ డెలివరీ నోటిఫికేషన్లు: “మీ ప్యాకేజీ త్వరలో వస్తుంది. మీ చిరునామాను నిర్ధారించడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.”
  • OTP, వ్యక్తిగత డేటా అభ్యర్థనలు: మోసగాళ్లు మీ అకౌంట్‌ను వెరిఫై చేయాలని మిమ్మల్ని నమ్మించి, మీరు OTPలు లేదా వ్యక్తిగత వివరాలను వారికి షేర్ చేసేలా పన్నాగాలు పన్నుతారు.
  • నకిలీ పోటీలో గెలుపొందారు లేదా బహుమతి సాధించారు: “అభినందనలు! మీరు ఉచిత బహుమతిని గెలుచుకున్నారు. ఇప్పుడే దాన్ని క్లెయిమ్ చేసుకోండి!”

స్మిషింగ్‌ నివారణ పద్ధతులు

  • అనుమానాస్పద మెసేజ్‌ల్లోని లింక్‌లను క్లిక్ చేయవద్దు: తెలిసిన ఫోన్ నంబర్ నుండే SMS వచ్చినట్లుగా అనిపించినప్పటికీ, వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి.
  • రిప్లై ఇచ్చేటప్పుడు వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ పంపకండి: చట్టబద్ధమైన సంస్థలు సున్నితమైన డేటాను టెక్స్ట్ ద్వారా పంపమని అడగవు.
  • అనుమానాస్పద ఫోన్ నంబర్లను బ్లాక్ చేయండి: ఇలా చేయడం వల్ల మీపై జరిగే స్మిషింగ్ దాడుల సంఖ్య తగ్గవచ్చు.

విషింగ్ అంటే ఏమిటి?

విషింగ్ (వాయిస్ ఫిషింగ్) అనేది ఒక రకమైన స్కామ్, దీనిలో స్కామర్లు ఫోన్ కాల్స్ చేసి, వ్యక్తులను మోసగించి గోప్యమైన సమాచారాన్ని బయటపెట్టేలా చేస్తారు. విషర్లు (విషింగ్‌కు పాల్పడేవారు) తరచుగా సాంకేతిక సహకారాన్ని అందించేవారి లాగా నటిస్తారు, అలాగే ప్రభుత్వ సంస్థ నుంచి కాల్ చేశామని లేదా బాధలో ఉన్న కుటుంబ సభ్యులమని నమ్మిస్తూ, మోసగిస్తారు. మీ వ్యక్తిగత సమాచారం లేదా ఆర్థిక వివరాలను మీరే తెలిపేలా మిమ్మల్ని మోసగించడానికి సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాలను వాడుకుంటారు.

విషింగ్ స్కామ్‌లను గుర్తించే పద్ధతి

  • కాలర్ ఐడి స్పూఫింగ్: మోసగాళ్లు చేసే కాల్స్, చట్టబద్ధమైన సోర్స్‌ల నుండి వచ్చినట్లుగా అనిపిస్తాయి. 
  • భావోద్వేగాల నియంత్రణ: మీ బ్యాంక్ అకౌంట్‌ను వేరెవరో వాడుతున్నారని లేదా మీరు పన్నులు కట్టాల్సి ఉందని నమ్మిస్తూ, అత్యవసరంగా స్పందించి చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని గాబరా పెడతారు.
  • సోషల్ ఇంజనీరింగ్: మీ గుర్తింపును వెరిఫై చేసే నెపంతో పాస్‌వర్డ్‌లు, పిన్‌లు లేదా OTPలతో సహా సున్నితమైన వివరాలను వారు అడుగుతారు.

విషింగ్ స్కామ్‌‌ల నివారణ పద్ధతి

  • బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నామని అవతలి వ్యక్తి చెప్పినప్పటికీ, ఫోన్‌లో బ్యాంకింగ్ వివరాలు లేదా OTPలను ఎప్పుడూ వెల్లడించకండి.
  • తెలియని వ్యక్తులు కాల్ చేసి ఆర్థిక లేదా వ్యక్తిగత సమాచారం అడిగితే మీరు జాగ్రత్తగా వ్యవహరించండి.
  • ఏదైనా సందేహం వస్తే, కాల్ కట్ చేసి, ఆ సంస్థ అధికారిక కస్టమర్ సర్వీస్ నంబర్‌కు కాల్ చేయండి.

మోసాలన్నిటికీ కేంద్ర బిందువు: నేర్పుగా నమ్మించడం

మోసం చేసే పద్ధతులు వేర్వేరుగా ఉన్నప్పటికీ, ఫిషింగ్, స్మిషింగ్, విషింగ్ అన్నీ “నేర్పుగా నమ్మించడం”పైనే ఆధారపడి ఉంటాయి. అవి మన నమ్మకాన్ని, భయాన్ని లేదా ఉత్సాహాన్ని తెలివిగా ఉపయోగించుకుని, మన గోతిని మనమే తవ్వుకునేలా, అంటే మన ప్రయోజనాలకు విరుద్ధంగా మనమే ప్రవర్తించేలా మోసగిస్తాయి. ఈ స్కామ్‌లు ఎలా జరుగుతాయో అర్థం చేసుకోవడంతో పాటు, సురక్షితమైన ఆన్‌లైన్ అలవాట్లను పాటించడం ద్వారా మీరు స్కామ్ బారిన పడే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి, అప్రమత్తంగా ఉండండి, ఫిషింగ్ స్కామ్‌ల బారిన పడకండి!

ఫిషింగ్, విషింగ్ & స్మిషింగ్ ఘటనల గురించి ఎలా తెలపాలి?

మీరు స్కామ్‌కు గురయ్యారు లేదా ఎవరైనా గురి చేస్తున్నారనే అనుమానం మీకు కలిగితే, వెంటనే దాని గురించి తెలపండి:

PhonePeలో నివేదించడం:

అధికారులకు తెలపడం:

  • సైబర్ క్రైమ్ సెల్‌: సైబర్ క్రైమ్ పోర్టల్‌కు వెళ్లి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయండి లేదా 1930కు కాల్ చేసి సమాచారమివ్వండి.
  • టెలికమ్యూనికేషన్స్ విభాగం (DOT): అనుమానాస్పద మెసేజ్‌లు, కాల్స్, లేదా వాట్సాప్‌ మోసం గురించి సంచార్ సాథీ పోర్టల్‌లోని ఛక్షు సౌకర్యం ద్వారా తెలపండి.

ముఖ్య గమనిక — PhonePe ఎన్నడూ గోప్యమైన లేదా వ్యక్తిగతమైన సమాచారం కోరదు. phonepe.com డొమైన్ నుండి రాకుంటే, PhonePeనుండి పంపుతున్నామని చెప్పే మెయిళ్లను పట్టించుకోవద్దు. మోసం చోటు చేసుకున్నట్టు మీకు ఎక్కడైనా అనుమానం ఏర్పడితే, దయచేసి వెంటనే అధికారులను సంప్రదించండి.

Keep Reading