
Trust & Safety
మోసగాళ్ల కుట్రలో మధ్యవర్తి కావొద్దు: ఆశ, అమాయకత్వం చుట్టూ తిరిగే మనీ మ్యూల్ స్కామ్
PhonePe Regional|4 min read|27 February, 2025
మీ బ్యాంక్ అకౌంట్‌కు మేము డబ్బులు పంపుతాం, ఆ డబ్బులను మేము చెప్పేవాళ్లకి ఫార్వార్డ్ చేయండి, అలా చేసినందుకే మీకు వారానికి 500 రూపాయలు ఇస్తాం’ అని ఎవరైనా మీకు ఆఫర్ ఇస్తే మీరేమనుకుంటారు? అబ్బా! ఈ ఆఫర్ నిజమైతే బాగుంటుంది, సులువుగా డబ్బులు సంపాదించుకోవచ్చు అని మీరు అనుకుంటారు కదా? అయితే చాలా మందికి ఇలాంటి ఆఫర్లు నిజంగానే వస్తున్నాయి – కాకపోతే ఇది చాలా పెద్ద స్కామ్! సాధారణ, అమాయక ప్రజలే లక్ష్యంగా, మోసగాళ్లు భారీగా పాల్పడుతున్న ఆర్థిక మోసాలలో ఇది ఒకటి.
స్కామర్లు మనీ లాండరింగ్ చేయడానికి లేదా నేరస్థుల వ్యక్తిగత ప్రమేయం లేకుండా ఇతర చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు నిర్వహించడానికి మ్యూల్ అకౌంట్లను ఉపయోగిస్తారు. మ్యూల్ అకౌంట్లు అంటే ఏమిటి, అవి ఎలా పనిచేస్తాయి, వాటి వల్ల ప్రజలకు, అలాగే కంపెనీలకు ఎందుకు భారీ నష్టం జరుగుతుందో ఈ బ్లాగ్‌లో వివరిస్తాము.
మనీ మ్యూల్ అంటే ఏమిటి?
స్కామ్ లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో భాగంగా ఒక అకౌంట్ నుండి మరో అకౌంట్‌కు డబ్బును బదిలీ చేసే లేదా “మ్యూల్ (మోసపూరిత ఉద్దేశంతో డబ్బును వేరే చోటకు చేరవేసే వ్యక్తి)” చేసే వ్యక్తులను మనీ మ్యూల్స్ అంటారు. ఈ ప్రక్రియలో భాగంగా ఏదైనా మనీ మ్యూల్ అకౌంట్‌కు డబ్బులు వస్తాయి, వాటిని మరొక అకౌంట్‌కు మ్యూల్స్ బదిలీ చేస్తారు. ఇలా చెయ్యడం కోసం సాధారణంగా స్కామర్లు కొంత ఫీజు పే చేస్తారు లేదా రివార్డ్‌లు ఇస్తామని నమ్మబలుకుతారు. కొంతమంది ఈ మోసాల్లో పాల్గొనడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినప్పటికీ, చాలామంది మోసపోయి నేరంలో భాగస్వాములవుతారు.
ఇలా కూడా జరగొచ్చు: మీరు ఫైనాన్స్ అసిస్టెంట్‌గా సెలెక్ట్ అయ్యారంటూ మీకు ఒక జాబ్ ఆఫర్ వస్తుంది. అది నమ్మదగిన ఆఫర్‌గానే కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ పేమెంట్లు ప్రాసెస్ చేయడంలో కంపెనీకి సహాయం చేయడమే మీరు చేయాల్సిన పని అని చెబుతారు – దీంతో ఈ పని సులభమే అని మీకు అనిపిస్తుంది. కానీ మీరు గ్రహించని విషయం ఏమిటంటే మీరు ఆ జాబ్‌ను యాక్సెప్ట్ చేస్తే మీరు ఒక మనీ మ్యూల్ అవుతారు, అలాగే సంక్లిష్టమైన మనీ లాండరింగ్ ఆపరేషన్‌లో ఓ భాగమవుతారు.
మ్యూల్ అకౌంట్లు సాధారణంగా మనీలాండరింగ్ స్కీమ్‌లలో కీలక పాత్ర పోషిస్తాయి. మనీ లాండరింగ్‌లో దోచుకున్న ఫండ్‌లను, అవి ఎక్కడి నుండి వచ్చాయన్న విషయం బయటకు తెలియకుండా ఉండటం కోసం అనేక మ్యూల్ అకౌంట్ల ద్వారా స్కామర్ల అకౌంట్లకు చేరుస్తారు, దీని వల్ల అధికారులు ఈ లావాదేవీల వెనుక జరిగే నేర కార్యకలాపాలను గుర్తించడం చాలా కష్టమవుతుంది. ఫిషింగ్ స్కీమ్‌లు, లాటరీ మోసాలు లేదా పెట్టుబడి మోసాలు వంటి స్కామ్‌లలో కూడా ఈ అకౌంట్లను ఉపయోగించవచ్చు, వాటికే బాధితులు డబ్బు పంపేలా మోసగాళ్లు కుట్రలు పన్నుతారు.
మోసగాళ్లు తమ నెట్‌వర్క్‌ను ఎలా నిర్మించుకుంటారో తెలుసా
మనీ మ్యూల్ నెట్‌వర్క్‌లు అనేవి బాధితులు, మ్యూల్స్ మధ్య లావాదేవీలను నేరస్థులు జాగ్రత్తగా నిర్వహించే కార్యకలాపాలు, అవి వారి అజ్ఞాతాన్ని, అంటే బయటకి వారి వివరాలు తెలియకుండా కాపాడుతాయి. ఈ మోసపూరిత వలయాలను సమన్వయం చేసే “మ్యూల్ కంట్రోలర్లు” లేదా “రిక్రూటర్లు” ఈ మొత్తం ప్రక్రియను నియంత్రించే స్థాయిలో ఉంటారు.
మ్యూల్ కంట్రోలర్లు ఎలా పనిచేస్తారు?
- నియామకం: మోసగాళ్లు వ్యక్తులతో నేరుగా మాట్లాడి, “సులభంగా డబ్బు సంపాదించండి” వంటి ప్రకటనలు లేదా నకిలీ ఉద్యోగ అవకాశాలు లేదా సోషల్ మీడియా ద్వారా మ్యూల్స్‌గా మారేందుకు సిద్ధంగా ఉన్నవారిని గుర్తిస్తారు. వీటి గురించి మొదటిసారి తెలుసుకున్నప్పుడు లేదా విన్నప్పుడు చట్టబద్ధమైన అవకాశాలుగా అనిపించినప్పటికీ, వాటి అసలు లక్ష్యం వ్యక్తులను మ్యూల్స్‌గా మార్చడమే.
- ఫండ్‌ల సేకరణ: మ్యూల్ అకౌంట్‌ను క్రియేట్ చేసిన తర్వాత, తరచుగా స్కామ్‌లు, మోసం లేదా దొంగిలించిన క్రెడిట్ కార్డుల నుండి వచ్చే ఫండ్లు ఆ మ్యూల్ అకౌంట్‌లో జమ అవుతాయి. ఈ లావాదేవీలు వైర్ ట్రాన్స్‌ఫర్ లేదా ఆన్‌లైన్ పేమెంట్ పద్ధతుల్లో జరగవచ్చు.
- డబ్బు ప్రవహించే తీరు: స్కామ్ చేసే వ్యక్తి ఆ డబ్బును మరొక అకౌంట్‌కు లేదా క్రిప్టోకరెన్సీ వాలెట్‌కు పంపమని, అలాగే తరచుగా విదేశాల్లో ఉన్న అకౌంట్లకు పంపమని మ్యూల్‌కు సూచించవచ్చు, కొన్ని సందర్భాల్లో డబ్బును వేరే కరెన్సీలోకి మార్చడానికి లేదా మరొక చోటుకు పంపాల్సిన వస్తువులను కొనుగోలు చేయడానికి కూడా మ్యూల్స్‌ను ఎంపిక చేస్తారు.
- ట్రాక్‌లను కవర్ చేయడం: పలుమార్లు వరుసగా వేర్వేరు మ్యూల్ అకౌంట్ల ద్వారా నేరస్థులు డబ్బును బదిలీ చేయడం వల్ల, అక్రమ ఫండ్లను గుర్తించడం దర్యాప్తు అధికారులకు కష్టతరమవుతుంది. డబ్బును మొదటగా ఎవరు పంపారు, చివరిగా ఎవరికి చేరింది వంటివి గుర్తించడాన్ని కష్టతరం చేయడం కోసం ఆర్థిక లావాదేవీల క్రమంలో గందరగోళాన్ని సృష్టించడమే నేరస్థుల లక్ష్యం.

మ్యూల్స్‌ను మోసగాళ్లు ఎలా ఎంపిక చేస్తారు?
మోసగాళ్లు తరచుగా ఆర్థికంగా కష్టాల్లో ఉన్నవారిని లేదా డబ్బు సంపాదించడానికి సులభమైన మార్గాలను వెతుకుతున్న వారిని లక్ష్యంగా చేసుకుంటారు. దీని కోసం వారు అనుసరించే కొన్ని వ్యూహాలు:
- నకిలీ ఉద్యోగ ఆఫర్లు: స్కామర్లు తరచుగా నకిలీ ఉద్యోగాలను ప్రకటిస్తారు, ముఖ్యంగా రిమోట్‌గా లేదా ఇంటి నుండి పని చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రకటనలు ఇస్తారు. ఈ ఉద్యోగాల్లో చేరితే, తక్కువ శ్రమతోనే సులభంగా డబ్బు లేదా కమీషన్ పొందవచ్చని హామీ ఇస్తారు. బాధితుడు దీనికి అంగీకారం తెలిపిన తర్వాత, డబ్బులు సేకరించి, వేరే వారికి పంపడానికి వీలుగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమని సూచిస్తారు.
- పెట్టుబడి, లాటరీ మోసాలు: బాధితులు లాటరీ గెలిచారని లేదా పెట్టుబడి అవకాశాన్ని పొందారని స్కామర్లు నమ్మిస్తారు. దీనికి సంబంధించిన ఫండ్లు పొందడం కోసం అకౌంట్ ఓపెన్ చేయాలని సూచిస్తారు, ఆ తర్వాత దాన్ని మోసపూరిత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
- అత్యవసర పరిస్థితులు: కొంతమంది స్కామర్లు భయాన్ని, అత్యవసర పరిస్థితులను ఉపయోగించుకుని మోసం చేస్తారు. ఎవరైనా బాధితుడిని కలసి, తమకు ఓ వ్యక్తి డబ్బు బాకీ ఉన్నాడని, తమకు సహకరించి ఫండ్ల బదిలీకి సహాయం చేయకపోతే తాము తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని నమ్మబలికి మోసానికి పాల్పడతారు.
మ్యూల్‌గా మారితే కలిగే నష్టాలు, ఎదుర్కోవాల్సిన పరిణామాలు
కొంతమంది స్వచ్ఛందంగా మనీ మ్యూల్స్‌గా మారడానికి ముందుకు వస్తే, చాలా మంది తెలియకుండానే ఇందులో ఓ పావుగా మారుతారు. అయితే, ఉద్దేశ్యం ఏదైనా, మోసగాళ్ల అకౌంట్లతో మీరు లావాదేవీలు జరపడం వల్ల తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది:
1. న్యాయపరమైన పర్యవసనాలు
- మనీలాండరింగ్, మోసానికి పాల్పడినందుకు క్రిమినల్ అభియోగాలు
- జైలు శిక్ష పడే అవకాశం
- బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవ్వడం, ఆర్థిక సేవలపై పరిమితుల విధింపు
2. ఆర్థిక నష్టం
- సొంత డబ్బులను పోగొట్టుకోవడం
- చట్టపరంగా పోరాడటానికి అయ్యే ఖర్చు
- జరిమానా పడే, నష్టాన్ని వసూలు చేసే అవకాశం
- క్రెడిట్ రేటింగ్‌కు దీర్ఘకాలికంగా నష్టం
మనీ మ్యూల్ స్కామ్‌లను నివారించే విధానం
- తెలియని వ్యక్తులతో ఆన్‌లైన్‌లో మాట్లాడకండి
- వేరొకరి తరపున బ్యాంక్ అకౌంట్‌ను ఓపెన్ చేయవద్దు
- మీ డెబిట్ కార్డ్, పాస్‌బుక్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ పాస్‌వర్డ్‌ను ఎవరికీ ఇవ్వకండి
- మీ మొబైల్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను తరచుగా మార్చండి
- మీకు తెలియని ఇతరుల అకౌంట్లకు డబ్బు బదిలీ చేయాల్సి వచ్చే ఉద్యోగ అవకాశాలను స్వీకరించొద్దు
- ఇతరులు మీ అకౌంట్‌ను ఉపయోగించి డబ్బును పొందడానికి లేదా పంపడానికి అనుమతి ఇవ్వకండి
- మీకు ఇచ్చిన అమౌంట్‌లో కొంత భాగాన్ని వేరే వారికి పంపితే డబ్బులు ఇస్తామని ఎవరైనా అవకాశమిస్తే అంగీకారం తెలపకండి
- OTP లేదా CVV, పాస్‌వర్డ్ వంటి లాగిన్ క్రెడెన్షియల్స్‌ను ఎవరికీ ఇవ్వొద్దు.
- నమ్మశక్యంగా లేని ఆఫర్లు, చౌక డీల్‌లు, అలాగే డిస్కౌంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
- మీ అకౌంట్ లావాదేవీలను క్రమం తప్పకుండా చెక్ చేయండి, అలాగే ఏదైనా అసాధారణ యాక్టివిటీ జరిగినట్లుగా గుర్తిస్తే వెంటనే బ్యాంక్‌లకు తెలియజేయండి.
- SMS/ఇమెయిల్/IVR ద్వారా బ్యాంక్‌లు పంపించే తాజా అప్‌డేట్లను పాటించండి.
మనీ మ్యూల్ స్కామ్‌లో మీరు భాగమయ్యారనే అనుమానం మీకు వస్తే PhonePeలో ఆ సమస్యను ఎలా తెలియజేయాలి
PhonePeలో స్కామర్ మిమ్మల్ని మోసగిస్తే, మీరు వెంటనే కింది మార్గాల్లో సమస్యను తెలపవచ్చు:
PhonePeలో ఉద్యోగ మోసం బారిన పడినప్పుడు, మీరు వెంటనే ఆ సమస్యను కింది మార్గాల్లో లేవనెత్తవచ్చు:
- PhonePe యాప్: Help/సహాయం విభాగానికి వెళ్లి, “లావాదేవీతో సమస్య ఉంది” ఆప్షన్ కింద మీ సమస్యను తెలపండి.
- PhonePe కస్టమర్ కేర్ నంబర్: మీరు సమస్యను లేవనెత్తడానికి PhonePe కస్టమర్ కేర్ నంబర్ 80–68727374 / 022–68727374కు కాల్ చేయవచ్చు, ఆ తర్వాత కస్టమర్ కేర్ ఏజెంట్ మీ కోసం టికెట్‌ను క్రియేట్ చేసి, మీ సమస్యకు పరిష్కారం చూపుతారు.
- వెబ్‌ఫామ్‌లో సబ్‌మిట్ చేయడం : మీరు PhonePe వెబ్‌ఫామ్ https://support.phonepe.com/కు వెళ్లి కూడా టికెట్‌ను లేవనెత్తవచ్చు.
- సోషల్ మీడియా: మీరు ఈ కింద పేర్కొన్న PhonePe సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా మోసపూరిత ఘటనలను రిపోర్ట్ చేయవచ్చు
ట్విటర్ — https://twitter.com/PhonePeSupport
ఫేస్‌బుక్ — https://www.facebook.com/OfficialPhonePe
5. ఫిర్యాదు పరిష్కారం: ఇదివరకే చేసిన ఫిర్యాదును పరిష్కరించమని కోరడానికి, మీరు https://grievance.phonepe.com/లోకి లాగిన్ అయ్యి, గతంలో పంపిన టికెట్ ఐడిని షేర్ చేయవచ్చు.
6. సైబర్ సెల్: చివరగా, మీరు సమీపంలోని సైబర్ క్రైమ్ సెల్‌కు వెళ్లి, జరిగిన మోసం గురించి ఫిర్యాదు చేయవచ్చు లేదా https://www.cybercrime.gov.in/కు వెళ్లి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు లేదా 1930కు కాల్ చేసి సైబర్ క్రైమ్ సెల్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.
7. DOT: డిజిటల్ నేరం జరగకపోయినా, ఏదో రకంగా జరిగిందనే అనుమానం మీకు ఉంటే, తప్పకుండా ఫిర్యాదు చేయండి. టెలికమ్యూనికేషన్స్ శాఖ సంచార్ సాథీ పోర్టల్(sancharsaathi.gov.in)లో చక్షు సౌకర్యాన్ని ప్రారంభించింది, దీనిలో అనుమానాస్పద మెసేజ్‌లు, కాల్స్, మోసపూరిత వాట్సప్ అకౌంట్లను రిపోర్ట్ చేయవచ్చు.
ముఖ్య గమనిక — PhonePe ఎన్నడూ గోప్యమైన లేదా వ్యక్తిగతమైన సమాచారం కోరదు. phonepe.com డొమైన్ నుండి రాకుంటే, PhonePeనుండి పంపుతున్నామని చెప్పే మెయిళ్లను పట్టించుకోవద్దు. మోసం చోటు చేసుకున్నట్టు మీకు ఎక్కడైనా అనుమానం ఏర్పడితే, దయచేసి వెంటనే అధికారులను సంప్రదించండి.