Investments
మీ నెల జీతం నుండి తగినంత మదుపు చేస్తున్నారా?
PhonePe Regional|2 min read|11 June, 2021
నా నెల జీతంలో నేను ఎంత శాతం మదుపు చేయాలి? ఎంతోమందికి ఈ ప్రశ్న తలెత్తుతుంటుంది. మదుపు చేయడం ప్రారంభించాలనుకున్న ప్రతి మదుపరికి మొదట తలెత్తే సాధారణ ప్రశ్న ఇదే.
అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. మీ ఆర్థిక లక్ష్యాలను అందుకోవడానికి వీలుగా మదుపు పెట్టాల్సిన మొత్తం గురించి ఒక అవగాహన కల్పించే కొన్ని చిట్కాలను మేము అందిస్తున్నాము.
విషయాన్ని బాగా అర్థం చేసుకోవడానికి వీలుగా మీకోసం క్రికెట్ ఉదాహరణతో చిన్న విశ్లేషణ!
50 ఓవర్‌ల ODI క్రికెట్ మ్యాచ్‌లో, మొదట బ్యాటింగ్ చేసే జట్టుకు మ్యాచ్ గెలవడానికి కచ్చితమైన స్కోర్ ఎంత కొట్టాలి, కచ్చితంగా ఎంత రన్ రేట్ ఉండాలనే విషయాలు తెలియవు.
అయినప్పటికీ, మ్యాచ్‌ను గెలవడానికి వీలుగా వారు నిర్దిష్ట కనీస రన్ రేట్‌తో ఇన్నింగ్స్ (ఓవర్‌కు 5–6 రన్‌లు అనుకోండి) ఆడతారు. (ఓవరాల్ రన్ రేట్ ఎక్కువ ఉంటే, మ్యాచ్ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి)
ఆ రకంగానే, మీరు 20 నుండి 35 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్నప్పుడు, మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల మీద స్పష్టమైన అవగాహన ఉండదు. ఆ లక్ష్యాలు మీ జీవనశైలి, ఆదాయం, కుటుంబ అవసరాలు మొదలైన వాటి మీద ఆధారపడి కాలంతో పాటు మారుతుంటాయి.
అటువంటి స్పష్టమైన అవగాహన లేనప్పుడు మీరేం చేయాలంటే, మీ మదుపు పెట్టుబడుల ప్రయాణాన్ని ప్రారంభించి, ఆమోదించిన నిర్దిష్ట మదుపు రేటు — అంటే, మీ నికర ఆదాయంలో 30–40% మొత్తాన్ని మదుపు చేయడం అనేది, ఆరోగ్యకరమైన మదుపు పెట్టుబడిగా పరిగణించవచ్చు.
ఒక బ్యాట్స్‌మెన్ ఏ విధంగా అయితే ప్రతి ఓవర్‌కు 5 లేదా అంతకంటే ఎక్కువ రన్‌లను తీయలేకపోతాడో, అదే విధంగా ప్రతి నెలా మీరు 30–40% ఆదా చేయలేకపోయినా ఫరవాలేదు. కాలం గడిచే కొద్దీ సరాసరి మదుపు పెట్టుబడిని స్థిరంగా ఉంచగలిగితే చాలు. అలాగే, ఒకవేళ మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో మీరు ఎక్కువ (50% అనుకోండి) ఆదా చేయగలిగితే, అలాగే చేసి మదుపు చేయండి, ఎందుకంటే భవిష్యత్తులో మీరు 30–40% మదుపు పెట్టుబడి రేటును స్థిరంగా ఉంచడం సాధ్యపడని పరిస్థితి కూడా రావచ్చు.
గుర్తుంచుకోండి, చిన్న వయస్సులో ఉన్నప్పుడు మదుపు చేయడం వల్ల, చక్రవడ్డీ ప్రభావంతో దీర్ఘకాలంలో మీకు మంచి లాభాలు వచ్చి, ధనవంతులు అవ్వాలన్న మీ ప్రయాణానికి ఉపయోగకరంగా ఉంటుంది (దీని గురించి ఈ బ్లాగులో మరిన్ని విషయాలు చదవండి)
ఇప్పుడు, మళ్లీ మన క్రికెట్ ఉదాహరణకు వద్దాం. కానీ ఈసారి, ODI మ్యాచ్‌లో జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తోందనుకుందాం. వారు రెండో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నారు కాబట్టి, ఎన్ని రన్‌లు కొట్టాలనే స్పష్టత బ్యాట్స్‌మెన్‌కు ఉంటుంది, అందుకు తగ్గట్టుగా ఆట తీరును, వేగాన్ని మారుస్తూ ఇన్నింగ్స్ పూర్తి చేస్తారు.
అదే రకంగా, మీరు 35 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సుకు చేరుకునే కొద్దీ, మీ స్వల్ప, మాధ్యమిక, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల మీద మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. ఈ స్పష్టత ఆధారంగా మీ లక్ష్యాలకు తగినట్లుగా ప్రొఫైల్ రిస్క్‌ను, ఆశించే రిటర్న్ రేటును దృష్టిలో పెట్టుకుని ఎంత మొత్తాన్ని మదుపు చేయాలని మీరు నిర్ణయించుకోగలుగుతారు. ఉదాహరణకు, ఆర్థిక రక్షణ కోసం, మీ చిన్నారి భవిష్యత్తు కోసం, కారు కొనడం మొదలైన వాటి కోసం (ఆర్థిక లక్ష్య ఆధారిత మదుపు గురించి మేము మరొక బ్లాగులో తెలియజేస్తాం) మీరు కొంత మొత్తాన్ని సంపాదించాలనుకోవచ్చు. వీటిలో ప్రతి లక్ష్యాన్ని సాధించడానికి మీరు నిర్దిష్ట కాలంలో రెగ్యులర్‌గా మదుపు చేయాల్సి ఉంటుంది, ఆ మదుపు పెట్టుబడులన్నీ కలిసి మీ లక్ష్యాన్ని చేరుకునేందుకు సహాయపడతాయి.
చివరగా చెప్పేదేంటంటే, మీరు మదుపు ప్రారంభించడం చాలా ముఖ్యం. అది మీ ఆదాయంలో 20%, 30% లేదా 50% అయినా కావచ్చు, ఎంతో కొంత మదుపు చేయండి. మీరు మొదలుపెట్టిన తర్వాత, మీ సంపాదన ప్రయాణంలో పురోగతి చెందుతున్న కొద్దీ, మీరు ఆ మొత్తాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. మదుపు చేయడానికి ముందు దయచేసి అన్ని స్కీమ్-ఆధారిత డాక్యుమెంట్‌లను జాగ్రత్తగా చదవండి.